Add to Book Shelf
Flag as Inappropriate
Email this Book

అప్రాశ్యులు

By Bhimeswara Challa

Click here to view

Book Id: WPLBN0100302479
Format Type: PDF eBook:
File Size: 0.1 MB
Reproduction Date: 3/14/1966

Title: అప్రాశ్యులు  
Author: Bhimeswara Challa
Volume:
Language: Telugu
Subject: Fiction, నవల, ఫిక్షన్, రొమాన్సు,సర్రియలిజం, స్త్రీకథ, మహిళ, ప్రేమ, సామాజికం, అనుభవాలు, ఫెమినిజం, విమెన్లిబ్,Telugu Literature, Telugu fiction, Telugu novel, Romance, Love story, , రాగద్వేషము, స్త్రీపురుషసంభందం, స్త్రీపురుషాకర్షణ, అనుబంధాలు, సేవాభావం, త్యాగశీలత, చపలచిత్తం, చంచలత,Surrealistic novel, Idealistic novel, Characteristic novel
Collections: Love, Authors Community
Historic
Publication Date:
1966
Publisher: Adarsa Grandha Mandali, Vijayawada, India, in 1966
Member Page: Bhimeswara Challa

Citation

APA MLA Chicago

Challa, B. B. (1966). అప్రాశ్యులు. Retrieved from http://www.gutenberg.cc/


Description
This surrealistic Telugu novel bringing out, through its complex characters, the often colliding raw passions and naked urges innate to the human condition.

Summary
అరవైఏళ్లనాటి ఈ 'స్త్రీ' నవల ఈనాటి అతివకి ప్రతిబింబం. రజని ఆత్మనిర్భరత అసాధారణమయితే ఆమె చంచల ప్రవృత్తి అనూహ్యగోచరం. కమల పాతివ్రత్యసంకల్పం అఖుంటితమయితే ఆమె లోనయిన పరపురుషాకర్షణ ప్రకృతిచిత్తం. విశాల ఉదార సేవాభావం దైవత్వమయితే ఆమె చూపే అపార ప్రేమానురాగం స్త్రీ సహజ వ్యక్తిత్వం. ఈ ఐ-బాటిల్ లోని రజనీ - రామంల ప్రేమగీతాలు, కమల - ప్రసాద్ ల రాగద్వేషాలు మరియు విశాల - సనల్ ల అనురాగఛాయలు నేటి తెలుగు పాఠకుల కొరకు ఈ రచయిత పొందుపరచిన వింటేజ్ వైన్. ఆస్వాదించండి. త్రీఛీర్స్

Excerpt
ఆకాశానికి నిచ్చెన వేయ ప్రయత్నించటం ఎంతటి అవివేకమో అందరికీ సుగ్రాహ్యమే. అయినా అప్పుడప్పుడు మనమంతా ఆలా ప్రయత్నిస్తూనే వుంటాము. అది ఎంతో హాస్యాస్పదమయినా ఆ ఆలోచనలో వుండే మకరందాన్ని మనమంతా కాంక్షిస్తాము. ఎందుకంటేఆ ఆలోచన ఆహ్లాదకరమయినప్పుడు దానిని బలవంతంగా, ప్రయత్నపూర్వకంగా ఎందుకు బహిష్కరించాలి? అసంభవమయిన ఆలోచనలతో తెచ్చుకొన్న చిరునవ్వు, నిజమైన నిష్కల్మషమైన కన్నీరు కన్నా వున్నతమైనవంటే నేను అంగీకరించను. ఎందుకంటే ఆత్మవంచనకన్నా ఆత్మహత్య ఉన్నతమైనది. జీవితంలోని అనివార్యమైన దుఃఖాన్ని, దుర్భరమైన బాధల్ని ఎదుర్కొన్నప్పుడే మానవుడు ఆ ఆశ అనే పొగమంచులో తలదాచుకుంటాడు.పొగమంచు అంతరించి అంతర్ధానమయినపుడు ఆశారహితమై ఆత్మహత్యకు ఒడిగడతాడు, మరికొందరు అదేపంథాలో అంధులై సత్యాన్ని ఎదుర్కొనే సాహసము లేక అసత్యపు ఆత్మవంచనలతో ముందుకు సాగిపోతారు. మరణ సమయములో వీరులు కూడ యీ లోకాన్ని విడువలేక ప్రాకులాడుతారు. బావురుమని చేతులు జాపి ఆప్తులను ఆఖరిసారిగా ఆలింగనం చేసుకో ప్రయత్నిస్తారు. చాలా అరుదుగా మనకి యింకొక తరహావ్యక్తులు తటస్థపడుతారు. వారికి పొగమంచుతో ప్రయోజనము లేదు, ఆత్మవంచనకు ఆస్కారం లేదు, ఆత్మహత్యకు వెనుదీయరు. సాధారణంగా మధ్యతరగతి మానవ జీవితాలన్నీ వర్ణించదగ్గ సంఘటనలు లేకుండానే సాగిపోతూంటాయి. ఎక్కడో ఎవరికో జన్మిస్తారు. కొద్దోగొప్పో చదువుకుంటారు. ఎంతో కొంతమందిపిల్లల్నికంటారు. అవీ ఇవీ కష్టాల్ని నిత్యము ఎదుర్కొంటూనే వుంటారు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో వ్యాధితోనో, ఏదో ప్రమాదంలోనో కాలధర్మం చేస్తారు. ఇలాంటి శుష్క జీవనానికి అలవాటుపడి వుంటాము. అప్పుడప్పుడుకష్టాలు కట్టలుగా వచ్చినప్పుడు, ఆశాకిరణం అస్తమించినపుడు జీవితాన్ని అంతం చేసుకోవాలని గట్టివాంఛ కలుగుతుంది. నిజం చెప్పాలంటే యీ వాంఛ దాదాపు ప్రతి మానవునికీ ఏదో ఒక సమయంలో కలుగుతుంది. కాని క్రియారూపంగా యిది చాలా తక్కువసార్లు వెలువడుతుంది. జీవితంమీద వుండేతీపి దీనిని త్రొక్కివేసి అణగార్చి వుంచుతుంది. కాని అప్పుడప్పుడు తీవ్రమైన వాంఛ జీవితంమీద విరక్తిగా విజృంభించి జీవిని కబళించి వేస్తుంది. జీవితమనే తాత్పర్యం లేని తతంగానికి తిరుగుబాటే ఆత్మహత్య. కాకినాడలోని పేరు ప్రఖ్యాతులుగల డాక్టరు సుదర్శన రావుగారి కుమారుడు ప్రసాదరావు. ఆగర్భ శ్రీమంతుడు. ఏకైకపుత్రుడు ఎంతో గారాబంగా పెరిగాడు. చూడటానికి బాగా రూపసి. పచ్చటి బంగారపు శరీర ఛాయ, దారుఢ్యమైన అవయవాలు, సదా నుదుటిపై ప్రాకులాడే నల్లటి ఉంగరాల జుట్టు, శిల్పి మక్కువతో చెక్కిన మానవ విగ్రహంలా వుండేవాడు. కాని బాల్యం నుంచి అతనిలో ఒక రకమైన అశాంతి, క్షణికమైన ఉద్రేకాలు, ఆవేశాలు కనబడేవి, ఎవరినీ లక్ష్య పెట్టేవాడు కాడు. ప్రతి నిర్ణయాన్ని ధిక్కరించేవాడు. కోపము వచ్చినా, ప్రేమకలిగినా అతనంటే అందరికీ తగని భయం. చిన్నతనంనుంచీ మోటారుకార్లంటే సరదా. ఎంతో వేగంగా పోనిచ్చేవాడు. ఎవరితోనూ స్నేహం చేసేవాడుకాడు. ఎవరూ ప్రయత్నం చేసేవారు కారు. పక్కింటి ప్లీడరు విశ్వనాధంగారి అబ్బాయి రామంతోనే కాస్త స్నేహంగా వుండేవాడు. ఇద్దరూ చిన్నతనంనుంచి కలసి చదువుకున్నారు. సమవయస్కులు. రామం ప్రసాదంత రూపసి కాకపోయినా, చూడ చక్కనివాడే. సన్నగా, పొడుగ్గా చామనఛాయగా వుండేవాడు. మితభాషి. పలకరిస్తేనే కాని ఎవరితోనూ మాట్లాడేవాడు కాడు. ప్రసాదుతో స్నేహంవున్నా అతనికి ఆప్తమిత్రుడు, కమలాకరం అనే వేరొక వ్యక్తి వుండేవాడు. కమలాకరం తండ్రిగారు కూడ ప్లీడరుగారే. వారిద్దరి తల్లిదండ్రులకు బాగా స్నేహం. మొదటి నుంచి వారికి, వీరికి రాక పోకలుండేవి. కమలాకరం, రామం-వీరిద్దరి మనస్తత్వాలు సరిపడేవి. కమలాకరం శాంతస్వభావి, సహృదయుడు. అతని శాంత గంభీర వదనం అందరినీ ఆకర్షించేది. కమలాకరానికి, ప్రసాద్ కి ఆట్టే స్నేహం లేకపోయినా రామం ద్వారా యిరువురికి పరిచయం ఏర్పడింది. ముగ్గురు బి. ఏ వరకు కలిసి చదివేరు. పరీక్షలో ప్రసాద్ తప్పాడు. దానితో అతనితండ్రి ప్రసాద్ ని ఢిల్లీ చదువుకి తన తమ్ముని వద్దకు పంపించి వేశాడు. దానితో రామానికి అతనికి మధ్యనున్న స్నేహం మరుగున పడింది. బి. ఏ తరువాత రామం కమలాకరం మూడు సంవత్సరాలు వుద్యోగాన్వేషణలో వృధాగా గడిపివేశారు. చివరకు అదృష్టవశాత్తు యిరువురూ ఢిల్లీ సెక్రటేరియట్ లో అసిస్టెంట్ పరీక్షలో కృతార్ధులయ్యారు. ఢిల్లీ బయలుదేరే ముందు కమలాకరానికి వివాహమయింది. కమల ఇంటరు వరకు చదువుకుంది. చూచినవారంతా“చక్కని చుక్క”, “పుత్తడిబొమ్మ” ఆనేవారు. పీలగా, పల్చగా బలహీనంగా కనబడేది. తెల్లటి శరీర ఛాయ, నిర్మలమైన నేత్రాలు, తీర్చిదిద్దిన ముఖకవళికలు, నవ్వితే సొట్టలుపడే పాలబుగ్గలు. ఢిల్లీలో కమలాకరం కొత్త కాపురం పెట్టాడు.కరోల్ బాగ్ లో చిన్నయిల్లు అద్దెకు తీసుకున్నాడు. రామాన్ని కూడ వారితోనే కలిసివుండమన్నారు. కాని రామం అంగీకరించలేదు, “నూతనదంపతులు హనీమూన్ కానీయండి” అన్నాడు. కమలనవ్వుతూ “హనీమూన్ హృదయంలోనే యిమిడి వుంది. అయినా మీరు బయటవుంటేనే మంచిది. ఏకాంతంతో విసుగెత్తి వివాహం చేసుకుంటారు” అంది కమల. కమల ఎప్పుడూ నవ్వుతూ మందహాసం చేస్తూండేది. కాని కోపం కూడ క్షణంలోనే వచ్చేది. దానికి అందరూ భయపడేవారు. కమలాకరం యెడ ఆమెకు కొద్దికాలంలోనే స్వచ్చమైన అనురాగం, విశ్వాసం, గౌరవ అభిమానాలు ఏర్పడ్డాయి. ఆమెకేవిధమైన లోటు రానిచ్చేవాడు కాదు. ఇతరులలాగ బయటికి వెల్లడించకపోయినా ఆమెయెడ అతనికున్న ప్రేమానురాగాలు ఆమె గుర్తించగలిగింది. ఇరువురిలోను కమలదే కొంతవరకుపై చెయ్యిగా కనబడేది. చూచేవారు చాలామంది ఆదర్శదంపతులనేవారు ఈర్ష్యతో కొందరు “ఆడ పెత్తనం” అనేవారు. నిజానికి కమల నవ్వు అంతర్గతంలోని అశాంతిని, అలసటను కప్పిపుచ్చుతుంది, వీటికి కారణం ఏ మాత్రమూ లేదు,ఏదో అస్పష్టంగా ఆమె హృదయం ఘోషిస్తూంటుంది. ఏకాంతంగా వున్నప్పుడు మనస్సు పరిపరి విధాల ఆలోచిస్తూంటుంది. కమలాకరంవంటి సత్పురుషుడు, సహృదయుడు భర్తగా లభించటం తన అదృష్టమని ఆమె గుర్తించింది. కాని ఆమె హృదయం చేసే ప్రతి పనికి కారణాన్ని కాంక్షిస్తుంది. తన బుద్ధి కుశలతతో పరీక్షించందే ఆమె ఏదీ చేసేది కాదు. క్రమబద్ధంగా కారణరహితంగా చేసే ప్రతి పనీ ప్రశ్నించేది. అశాంతికి కారణమడిగితే కమల మౌనముద్ర వహిస్తుంది. కారణం ఆమెకే తెలియదు కాని దురూహ్యం కాదు. జీవితంలో శాంతికీ, చిరు నవ్వుకీ చోటు లేనప్పుడు, అశాంతికి అలసటకి కారణం వెదకడం అవివేకం కాదా? నిత్యం నిరర్థకంగా జీవితం గడిపే వారినే తిరిగి ప్రశ్నించాలి నీలోని యీ శాంతి ఎక్కడిది? అసత్యమైన యోగా శాంతికన్న సత్యమైన ఈ అశాంతే ఉన్నతమైనది కదా? క్రమంతప్పకుండా నువ్వుచేసే యీ తతంగానికి తాత్పర్య మేమిటి? కాలాతీతమైన ప్రశ్నలకి సనూధానంకోసం వెదుకకుండానే క్రమబద్ధంగా మనం జీవితం సాగిస్తాం. ఆకలి అయినప్పుడు ఆరగిస్తాము నిద్రవచ్చినప్పుడు నిద్రిస్తాము ఈ రెండింటినీ ఆమడదూరంలో వుంచితే రక్తమాంసాలు క్షిణిస్తాయి. సృష్టి అంతరించేలోగా ఇవి లేకుండా ఎవరు ఎప్పటికీ జీవించలేరా? మానవ ప్రయత్నానికి విజయాలు ఎన్ని చేకూరినా, ప్రకృతిని ఎంత జయించినా చివరకు ఆకలి, నిద్ర లేకుండా యీ శరీరయంత్రాన్ని నడపగలిగే విధానం కనిపెట్టలేరా? కమల వీటన్నిటి గురించి యింతగా ఆలోచిస్తూందని నేను చెప్పటం లేదు. కాని అప్పుడప్పుడు ఈ విధంగానే ఆమె మనస్సు పరిపవిధాల పరుగెడుతూ వుంటుంది.

 
 



Copyright © World Library Foundation. All rights reserved. eBooks from Project Gutenberg are sponsored by the World Library Foundation,
a 501c(4) Member's Support Non-Profit Organization, and is NOT affiliated with any governmental agency or department.